

తెలంగాణలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో సమావేశమై, తదుపరి లక్ష్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లా పరిషత్ పీఠాలను కైవసం చేసుకునేలా క్షేత్రస్థాయిలో వ్యూహాలు అమలు చేయాలని మంత్రులకు సూచించారు.
డిసెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని అసెంబ్లీలో చర్చకు తీసుకువచ్చి, తీర్మానం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయనుంది. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికల నిర్వహణపైనా ఈ సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశముందని సమాచారం.
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు పార్టీకి గ్రామ స్థాయిలో బలమైన పునాది అని సీఎం అభిప్రాయపడ్డారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, వారిని ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వాములను చేయాలని మంత్రులకు సూచించారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!