

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీ సాధించి హ్యాట్రిక్ విజయం అందుకున్న సందర్భంగా ఆయన పోలీసుల ప్రతిభను కొనియాడారు. ఈ విజయం రాష్ట్ర పోలీసుల కృషి, క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు.
తెలంగాణ సీఐడీ పర్యవేక్షణలో జరుగుతున్న నిరంతర శిక్షణ ఈ విజయానికి ప్రధాన కారణమని సీఎం అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో మరోసారి రాష్ట్ర పోలీసుల ప్రతిభ చాటుకోవడం గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ బి. శివధర్ రెడ్డి, సీఐడీ అదనపు డీజీ చారు సిన్హాను ప్రత్యేకంగా అభినందించారు.
గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ పోలీసులు విజయ పరంపర కొనసాగిస్తున్నారు. 2024లో లక్నో, 2025లో రాంచీ తర్వాత 2026లో నాగ్‌పూర్‌లో జరిగిన 69వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో కూడా తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలవడం విశేషం.
ఈసారి నాగ్‌పూర్‌లో జరిగిన పోటీల్లో తెలంగాణ బృందం అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీతో పాటు యాంటీ సాబోటేజ్ చెక్, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్నెస్ విభాగాల్లో విజేతగా నిలిచింది. అలాగే శాస్త్రీయ దర్యాప్తు సహాయాలు, పోలీస్ ఫోటోగ్రఫీ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచి రాష్ట్రానికి మరింత గౌరవం తీసుకొచ్చింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!