

జాతీయ రహదారుల పై టోల్ చెల్లించకుండా ప్రయాణించే వాహనదారుల పై ఇకపై కఠిన చర్యలు అమల్లోకి రానున్నాయి. టోల్ ఎగవేతను అరికట్టడం, టోల్ వసూళ్లలో పారదర్శకత పెంచడం లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలతో టోల్ చెల్లింపు వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు.
కొత్త రూల్స్ ప్రకారం టోల్ బకాయిలు పెండింగ్లో ఉన్న వాహనాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC), ఫిట్నెస్ సర్టిఫికేట్, నేషనల్ పర్మిట్ వంటి కీలక సేవలు అందుబాటులో ఉండవు. ఈ మేరకు ఇప్పటివరకు అమల్లో ఉన్న సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్–1989 ను సవరించి, కొత్త రూల్స్–2026 ను కేంద్రం జారీ చేసింది.
జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ఆధునిక సాంకేతికత ఆధారంగా టోల్ వసూళ్లను అమలు చేయడంలో ఈ నిబంధనలు ఉపయోగపడనున్నాయి. ఇకపై ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహన యాజమాన్యాన్ని మార్చాలంటే, ముందుగా టోల్ బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ఫీజులు పెండింగ్లో ఉంటే వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్ను కూడా రీన్యూ చేయరు.
అలాగే, ఎలక్ట్రానిక్ టోల్ వ్యవస్థ ద్వారా వాహనం టోల్ ప్లాజాను దాటినా, ఫీజు వసూలు కాకపోతే ఆ వాహనదారుడిని టోల్ చెల్లించని వ్యక్తిగా పరిగణిస్తారు. ఈ వివరాలను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఫారం–28 లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ ప్రక్రియను ఆన్లైన్లో కూడా పూర్తి చేసే సౌకర్యాన్ని కల్పించనున్నారు.
టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా ప్రయాణించేలా మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ వ్యవస్థను కూడా కేంద్రం దశలవారీగా అమలు చేయనుంది. ప్రస్తుతం కొన్ని హైవేల పై పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతున్న ఈ విధానాన్ని త్వరలో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టే యోచనలో ఉంది. జులై 2025 లో విడుదల చేసిన ముసాయిదా పై ప్రజల అభిప్రాయాలు సేకరించిన అనంతరం, తాజాగా తుది నోటిఫికేషన్ను కేంద్రం జారీ చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!