

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో రెండు రోజులుగా పెద్దపులి సంచరిస్తుండటం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో పులి అడుగుజాడలు కనిపించడంతో రైతులు, పశువుల కాపరులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
శుక్రవారం ఉమ్మడి పినపాక మండలం టి.కొత్తగూడెం పరిసరాల్లో పులి పాదముద్రలు గుర్తించగా, శనివారం కరకగూడెం మండలం నారాయణపేట సమీపంలోని జామాయిల్ తోటలో కూడా అదే తరహా జాడలు కనిపించాయి. అటవీ అధికారులు ఈ ప్రాంతాల్లో పరిశీలన నిర్వహించి పులి సంచారం ఉన్నట్లు ధృవీకరించారు.
ఈ విషయంపై అటవీ శాఖ రేంజర్ తేజస్వీ మాట్లాడుతూ, పులి ప్రస్తుతం కిన్నెరసాని అభయారణ్యం వైపు కదిలి ఉండవచ్చని తెలిపారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని గమనిస్తున్నామని చెప్పారు.
గ్రామస్తులు ఒంటరిగా అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పశువులను అడవికి సమీపంలో మేపకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!