

బంగ్లాదేశ్‌లో ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్, యువ రాజకీయ నేత షరీఫ్ ఉస్మాన్ హైదీ మృతి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన మరణంతో మొదలైన నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. పలు ప్రాంతాల్లో నిరసనకారులు పత్రికా కార్యాలయాలకు నిప్పు పెట్టగా, ప్రభుత్వ ఆస్తులకు కూడా నష్టం వాటిల్లింది.
ఇటీవలి బంగ్లాదేశ్ తిరుగుబాటులో కీలక పాత్ర పోషించిన హైదీ, మాజీ ప్రధాని షేక్ హసీనాకు నేతృత్వం వహిస్తున్న ఆవామీ లీగ్‌కు వ్యతిరేకంగా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. గత వారం గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన హైదీని మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
హైదీ మృతి వార్త వెలువడిన వెంటనే రాజధాని ఢాకాతో పాటు ఛత్తోగ్రామ్ సహా పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. ఛత్తోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయాన్ని నిరసనకారులు ముట్టడించారు. ఆవామీ లీగ్ కార్యాలయాలు, మీడియా సంస్థలే లక్ష్యంగా ఆందోళనలు జరిగాయి.
ప్రథమ్ ఆలో, డెయిలీ స్టార్ వంటి ప్రముఖ పత్రికల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. డెయిలీ స్టార్ కార్యాలయంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో పలువురు జర్నలిస్టులు లోపల చిక్కుకోగా, భద్రతా బలగాలు సుమారు 25 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. నిరసనకారులతో చర్చించేందుకు ప్రయత్నించిన న్యూఏజ్ పత్రిక ఎడిటర్ పై కూడా దాడి జరిగినట్లు సమాచారం.
ఇదే సమయంలో బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజీబ్ నివాసాన్ని కూడా దుండగులు ధ్వంసం చేశారు. ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న ఆ భవనానికి తీవ్ర నష్టం కలిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో పలు పత్రికలు నేటి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.
వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇంక్విలాబ్ మంచ్ తరపున రాజకీయ ప్రచారంలో ముందుండిన హైదీ హత్య దేశ రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!