

మెడికల్ అన్‌ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెడికల్ కారణాలతో విధులు నిర్వహించలేని ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైన తర్వాత, 2020 జనవరి 1 తర్వాత మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులందరికీ ఈ నిర్ణయం వర్తింపజేయనున్నారు. ఇప్పటివరకు విలీనానికి ముందు కేవలం డ్రైవర్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఉద్యోగాల విధానం ఉండగా, ఇక పై డ్రైవర్లు, కండక్టర్లు సహా అన్ని విభాగాల ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించనున్నారు.
కార్పొరేషన్లో పనిచేస్తున్న సమయంలో 21 కేటగిరీల్లో మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విలీనానంతరం కూడా ఇదే విధానాన్ని కొనసాగించనున్నారు.
మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు కండక్టర్, రికార్డ్ ట్రేసర్, అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ వంటి పోస్టుల్లో నియామకాలు చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీలో ఉద్యోగానికి అర్హత లేకపోతే, వారి అర్హతను బట్టి ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్ల ద్వారా ఆయా ప్రభుత్వ విభాగాల్లో నియామక ప్రక్రియ చేపట్టాలని సూచనలు జారీ చేసింది.
ఏ ఉద్యోగానికీ అర్హత లేని ఉద్యోగులకు అదనపు ఆర్థిక ప్రయోజనాలు (మానిటరీ బెనిఫిట్స్) కల్పించాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే మెడికల్ అన్‌ఫిట్ కారణంగా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోరుకునే ఉద్యోగులకు కూడా అదనపు ఆర్థిక ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈ అంశం పై తదుపరి చర్యలు చేపట్టాలని APPTDC కమిషనర్‌కు, అలాగే అన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!