

తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అక్రమాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ నెయ్యి వ్యవహారం, పరకామణిలో చోరీ ఆరోపణలు, పట్టువస్త్రాల కొనుగోళ్లలో అవినీతి వంటి అంశాల తర్వాత తాజాగా బంగారు తాపడం పనుల్లోనూ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
వరాహస్వామి ఆలయ విమాన గోపురం పై 2020 డిసెంబరులో చేపట్టిన బంగారు తాపడం పనుల్లో కాంట్రాక్టర్, జ్యువెలరీ అప్రైజర్ కలిసి బంగారాన్ని అపహరించేందుకు యత్నించినట్టు అప్పటి విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఈ పనుల కోసం టీటీడీ 24 క్యారెట్ల బంగారాన్ని కాంట్రాక్టర్కు అప్పగించింది. అయితే పనులు పూర్తైన తర్వాత వినియోగించిన బంగారం పరిమాణం రికార్డుల్లో అసాధారణంగా పెరిగినట్టు నమోదు కావడంతో అనుమానాలు మొదలయ్యాయి.
సాధారణంగా తాపడం పనుల్లో కొంత బంగారం వ్యర్థమవుతుంటే, ఇక్కడ మాత్రం లెక్కల్లో బంగారం పెరగడం గమనార్హం. ఇదే సమయంలో బంగారాన్ని ద్రవ రూపంలో తరలిస్తున్నారన్న ఫిర్యాదులతో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. స్ట్రాంగ్ రూంలో పాదరసం, శుద్ధి ద్రావణాలను పరిశీలించగా వాటిలో బంగారం కలిసినట్టు తేలింది. పలు దశల్లో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 100 గ్రాములకుపైగా లెక్కల్లో లేని బంగారం బయటపడింది.
విజిలెన్స్ అధికారులు పరిశీలించిన ఫోన్ సంభాషణల్లో, అపహరించిన బంగారం పై కమిషన్ డిమాండ్ చేసినట్టు సంకేతాలు లభించినట్టు సమాచారం. ఈ వ్యవహారం 2022 లోనే వెలుగులోకి వచ్చినప్పటికీ, అప్పటి పాలకులు విషయాన్ని బహిర్గతం కాకుండా అణిచివేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం పై జరిగిన బంగారు తాపడం పనుల పైనా తాజాగా ఫిర్యాదులు అందాయి. గతంలో ఈ అంశం పై విచారణ జరిగి, బంగారం మాయమైనట్టు ఆధారాలు లేవని విజిలెన్స్ నివేదిక ఇచ్చినా, ఇప్పుడు మళ్లీ కొత్త ఆరోపణలు రావడంతో మరోసారి విచారణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారం పై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాపడం పనులు నిబంధనల ప్రకారం జరగలేదని, విగ్రహాలకు నష్టం జరిగిందని ఆయన అన్నారు. ఈ కుంభకోణంలో అప్పటి టీటీడీ పాలకుల పాత్ర ఉందని ఆరోపిస్తూ, అధికారికంగా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఈ అంశాలు తిరుమలలో పాలనా పారదర్శకత పై మరోసారి ప్రశ్నలు లేపుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!