

వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ విడుదలైన రోజే సినిమాలోని ఓ సన్నివేశం వివాదానికి దారి తీసింది. ఎన్టీఆర్‌ను అవమానించేలా ఆ సన్నివేశం ఉందంటూ నందమూరి అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సన్నివేశాన్ని తొలగించి, చిత్రబృందం క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ అంశంపై స్పందించారు. ఎవరినీ ట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఆ సన్నివేశాన్ని రూపొందించలేదని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఈ సన్నివేశాన్ని గత నవంబర్‌లోనే చిత్రీకరించామని, ట్రోలింగ్‌కు, అనుకరణకు మధ్య చాలా తేడా ఉందని వివరించారు.
గొప్ప కళాకారులను అనుకరించడం కొత్త విషయమేమీ కాదని వరుణ్ తేజ్ అన్నారు. గతంలో ‘ఎఫ్3’ సినిమాలో కళ్యాణ్ గారి ‘వకీల్ సాబ్’ను కూడా అనుకరించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రచార చిత్రాల్లో కృష్ణ, చిరంజీవి వంటి ప్రముఖులను అనుకరించే సన్నివేశాలు కూడా ఉన్నాయని, అవన్నీ సరదా కోసం చేసినవేనని చెప్పారు. ఏ నటుడినీ అవమానించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ సన్నివేశం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొన్నారు. దీంతో ఈ వివాదంపై చిత్రబృందం తమ వైఖరిని స్పష్టం చేసినట్లైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!