

నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నాని సతీమణి అంజనా యలవర్తి సోషల్ మీడియాలో ఆయన 17 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. 2009లో నాని సినిమా చూసేందుకు తామంతా కాలేజీకి బంక్ కొట్టి వెళ్లిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే ఆ సినిమా విడుదల రోజున కనీసం మార్నింగ్ షో కూడా పడలేదని తెలిపారు. అప్పుడే సినీ పరిశ్రమకు కొత్తగా వచ్చిన వ్యక్తి తన సినిమాను సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఎంత కష్టమో అర్థమైందని పేర్కొన్నారు.
17 ఏళ్ల తర్వాత అదే నాని సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తుండటాన్ని చూస్తుంటే చాలా భావోద్వేగంగా అనిపిస్తోందని అంజనా అన్నారు. ప్రతి సినిమాతో నాని సంపాదించుకున్న నమ్మకమే ఈ స్థాయికి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఆయన సినీ ప్రయాణం ఒక్కరోజులో నిర్మించబడలేదని, ఆ ప్రయాణానికి తానే ప్రత్యక్ష సాక్షినని చెప్పారు. నాని ప్రతి సినిమానూ ఒక బిడ్డలా భావించి ఎంతో శ్రద్ధగా చూసుకున్నారని తెలిపారు. ‘ది ప్యారడైజ్’ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో అంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నానికి ఎప్పటికీ తాము అండగా ఉంటామని అంజనా భరోసా ఇచ్చారు. ఆమె చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!