

నటి శృతి హాసన్ తన మాతృత్వం, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకుంది. 13 ఏళ్ల వయసులోనే తనకు నెలసరి ప్రారంభమైందని, ఆ సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేదానినని తెలిపింది. నొప్పి భరించలేక వాంతులు చేసుకోవడం, స్పృహ కోల్పోవడం, ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పింది. వైద్య పరీక్షల్లో తనకు పీఎంఓఎస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో భవిష్యత్తులో తల్లి కాలేనని ఓ దశలో వైద్యులు చెప్పినట్లు వెల్లడించింది. అయితే మరో వైద్యుడి సలహాతో పీఎంఓఎస్ ఉన్నప్పటికీ మాతృత్వం కోసం పలు ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకుని ధైర్యం వచ్చిందని పేర్కొంది. అండాలను శీతలీకరించే విధానం గురించి కూడా తెలుసుకున్నానని, భవిష్యత్తులో తల్లిగా మారాలని నిర్ణయించుకున్నప్పుడు బిడ్డను కనడం లేదా దత్తత తీసుకోవడం.. ఈ రెండింటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటానని చెప్పింది.
పెళ్లి విషయంపైనా శృతి హాసన్ తన అభిప్రాయాలను వెల్లడించింది. పెళ్లంటే తనకు ఇష్టమేనని, అయితే వివాహ బంధాన్ని కేవలం కాగితంపై సంతకానికి పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజూ ఒకరినొకరు ప్రేమతో ఎంచుకోవడం, పరస్పరం గౌరవించుకోవడమే బంధాన్ని బలంగా ఉంచుతుందని చెప్పింది. పెళ్లి కోసం భారీగా ఖర్చు చేయడం, ఆడంబరాలకు ప్రాధాన్యం ఇవ్వడం తనకు నచ్చదని, అదే మొత్తాన్ని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఉపయోగిస్తే మరింత సంతృప్తి లభిస్తుందని పేర్కొంది. వివాహంలో భాగస్వామిపై ఆధిపత్యం కాకుండా పరస్పర గౌరవం ఉండాలని చెప్పిన శృతి.. తాను ఒకసారి పెళ్లి వరకు వెళ్లినా, సంప్రదాయ చట్రంలో ఇమిడిపోవడం తనకు ఇష్టం లేదని తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!