

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం ప్రారంభించి 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ కాగా, ఆ తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ ముందుగా విడుదలైంది. ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమైన చిరంజీవి.. దాదాపు ఐదు దశాబ్దాలుగా తనదైన నటన, స్టైల్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎక్స్ వేదికగా తండ్రికి భావోద్వేగ సందేశం అందించారు.
‘‘నాన్నా.. చిత్ర పరిశ్రమలో నీ ప్రయాణం మొదలై 48 ఏళ్లు పూర్తయింది. మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మేం ఎప్పటికీ మర్చిపోలేం. మా కోసం నువ్వు చేసిన కృషికి కృతజ్ఞతలు. నిన్ను ఆదరిస్తున్న ప్రేక్షకుల ప్రేమకు రుణపడి ఉంటాం. నీ ప్రయాణం ఎప్పటికీ మాకు స్ఫూర్తినిస్తుంది. 50 ఏళ్ల మైలురాయిని సెలబ్రేట్ చేసుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నా’’ అని చరణ్ పేర్కొన్నారు. మరోవైపు చిరంజీవి కూడా తన సినీ ప్రయాణంలో అండగా నిలిచిన నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు, విజయాలు తన ప్రయాణంలో భాగమయ్యాయని, తనను కుటుంబ సభ్యుడిగా భావించి అపూర్వమైన ప్రేమను అందించిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!