

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ మరికొద్ది గంటల్లో థియేటర్లలోకి రానుంది. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్‌గా మారింది. జడల్ పుట్టుక, అతని పోరాటం కల్పితమే అయినప్పటికీ.. అతని రూపం, ముఖ్యంగా జడలు తన చిన్ననాటి జ్ఞాపకాల నుంచి స్ఫూర్తి పొందాయని ఆయన తెలిపారు. తాను పెరుగుతున్న కొద్దీ సినిమాలోని ఎన్నో సన్నివేశాలు తన బాల్య జ్ఞాపకాల ప్రభావంతో రూపొందాయని గుర్తు చేసుకున్నారు.
తనకు ఐదేళ్ల వయసు వచ్చే వరకు అమ్మ జడలు వేసి కట్టేదని శ్రీకాంత్ తెలిపారు. పెద్దయ్యాక ఓ కమర్షియల్ సినిమాలో 70 ఎంఎం తెరపై జడలతో హీరో ఎలా కనిపిస్తాడో ఊహించుకునేవాడినని చెప్పారు. ఇప్పుడు నాని పోషించిన జడల్ పాత్రతో ఆ చిన్ననాటి కల నిజమైందని పేర్కొన్నారు. ‘ది ప్యారడైజ్’ కేవలం తన కల మాత్రమే కాదని, అదే తన స్వర్గమని భావోద్వేగంతో చెప్పిన శ్రీకాంత్.. జడల్‌గా నాని అన్నను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నానని తెలిపారు. మరికొద్ది గంటల్లో అందరినీ ‘ది ప్యారడైజ్’ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నానంటూ చేసిన ఆయన పోస్ట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!