

‘జబర్దస్త్’ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక సింగ్ తన నవ్వు, అల్లరితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బిగ్‌బాస్’ రియాలిటీ షో ద్వారా మరింత క్రేజ్ సంపాదించింది. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. సాయి తేజగా జన్మించిన ఆమె.. తన మనసులో కోరుకున్న విధంగా జీవించాలనే నిర్ణయంతో లింగ మార్పు ప్రక్రియలో భాగంగా పలు శస్త్రచికిత్సలు చేయించుకుంది. సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రియాంక తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అప్పట్లో తాను ఎదుర్కొన్న బాధ, కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, ఒంటరితనం, రక్తస్రావం వంటి అనుభవాలన్నీ ఇప్పటికీ కళ్లముందు కదులుతున్నాయని పేర్కొంది.
‘నేను ఏం చేయాలి? అసలు నేనెవరు?’ అని ఎన్నోసార్లు తనను తాను ప్రశ్నించుకున్నానని ప్రియాంక తెలిపింది. అయితే తన హృదయం కోరుకున్న వ్యక్తిగా జీవించాలన్న పట్టుదలతో ముందుకు సాగానని చెప్పింది. గడిచిన పదేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు, కెరీర్‌లో విజయాలు, కష్టతరమైన రోజులను చూశానని, అయినా ఎప్పుడూ తనను తాను వదులుకోలేదని పేర్కొంది. ఈ రోజు అద్దంలో తనను తాను చూసుకుంటూ ‘నేను సాధించాను’ అని గర్వంగా చెప్పగలనని తెలిపింది. ఎవరికీ హాని కలిగించకుండా తన సొంత నిబంధనల ప్రకారం ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నానని చెప్పింది. తనకు అందమైన జీవితాన్ని, ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రియాంక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు, నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!