

పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆగాయత్తిల్ ఒరు తారగై’ (‘ఆకాశంలో ఒక తార’) సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ తనకు చెన్నైతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాను మద్రాస్‌లోనే పుట్టి పెరిగానని, అక్కడే పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేశానని తెలిపారు. న్యాయవిద్యను మధ్యలోనే నిలిపివేసి 23 ఏళ్ల వయసులో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రెండు, మూడు సినిమాలు నిర్మించిన తర్వాత మరో వృత్తిలోకి వెళ్లాలని మొదట భావించినప్పటికీ, దాదాపు 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతున్నానని, ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించానని పేర్కొన్నారు. 2022లో ఈ సినిమా కథను సుమారు అరగంట పాటు విన్న వెంటనే సినిమాగా నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
తమిళంలో జీవీ ప్రకాశ్‌కుమార్‌ను తొలిసారి కథానాయకుడిగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అల్లు అరవింద్ అన్నారు. ఈ సినిమా కోసం భారత్‌కు వచ్చిన సాత్విక వీరవల్లిని తిరిగి షికాగోకు పంపకుండా ఇక్కడే ఉండేలా చూసుకున్నామని తెలిపారు. మరోవైపు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. చెన్నై తనకు ఇష్టమైన ప్రాంతాల్లో ఒకటని చెప్పారు. ‘సీతారామం’ సినిమా తర్వాత ‘ఆకాశంలో ఒక తార’ కథ విన్నానని, ఇందులో కథానాయికకు ప్రాధాన్యత ఉండటం తనకు బాగా నచ్చిందని వెల్లడించారు. ఈ సినిమా మరొకరి చేతుల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో, ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ ఇందులో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీ ప్రకాశ్‌కుమార్, సాత్విక వీరవల్లి తదితరులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!