

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల భారత ప్రభుత్వం ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పద్మశ్రీ ఆలస్యంగా వచ్చిన మాట నిజమేనని అంగీకరించిన ఆయన, అవార్డు కోసం ఎప్పుడూ ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. "మనమే అడిగి తీసుకుంటే అది భిక్ష. వారు మన సేవలను గుర్తించి పిలిచి ఇస్తే అది గౌరవం. నాకు ఈ రోజు ఆ గౌరవంతోనే పద్మశ్రీ వచ్చింది" అని అన్నారు.
అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో అవార్డు కోసం అడగాలని కొందరు సూచించినా తాను అలా చేయలేదన్నారు. 'మేడమ్' చిత్రంలో మహిళా పాత్రకు నంది అవార్డుల స్పెషల్ జ్యూరీ గుర్తింపు రావడానికి అక్కినేని నాగేశ్వరరావు చేసిన సహకారం జీవితాంతం మరువలేనిదని చెప్పారు. 'రాంబంటు' చిత్రాన్ని నిర్మించిన తర్వాత నిర్మాతగా తాను సరిపోనని గ్రహించి, నష్టాలను భర్తీ చేసేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలోని అర ఎకరం భూమిని విక్రయించానని వెల్లడించారు. జీవితంలో డబ్బు కంటే గౌరవానికే ఎక్కువ విలువ ఇచ్చానని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!