

గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పలు సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయింది. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడం ఇందుకు ప్రధాన కారణమని కాగ్ మార్చి నెల నివేదికలో వెల్లడించింది. అప్పులు పెంచి వ్యయాన్ని సర్దుబాటు చేయాలని ప్రయత్నించినప్పటికీ, పలు పథకాల నిధుల్లో కోతలు విధించాల్సి వచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది.
రైతు భరోసా పథకానికి రూ.18 వేల కోట్లు కేటాయించగా, రూ.14,397 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. చేయూత పథకానికి రూ.14,861 కోట్లు కేటాయించి, రూ.11,400 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకానికి రూ.12,571 కోట్లు కేటాయించినప్పటికీ, రూ.5,400 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు ఇంకా ప్రారంభం కాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకున్నప్పటికీ ఆదాయ లోటు ప్రభావం తీవ్రంగా కనిపించింది. రిజిస్ట్రేషన్లు, పన్నేతర ఆదాయం, కేంద్ర గ్రాంట్ల రూపంలో ఆశించిన మేర ఆదాయం రాలేదు. బహిరంగ మార్కెట్ నుంచి రూ.54 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని భావించగా, చివరకు రూ.77 వేల కోట్లకు పైగా అప్పులు చేసింది. అయినప్పటికీ వ్యయ లక్ష్యాలను చేరుకోలేకపోయినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!