

రైల్వేల్లో ప్రయాణికులకు అందించే తాగునీటి నాణ్యతపై కాగ్ నివేదిక నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా సుమారు 20 వేల ప్రాంతాల్లో ‘ట్యాంక్ టు ట్యాప్’ నీటి వడపోత వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో వాటర్ కూలర్లు, తాగునీటి కేంద్రాలతో పాటు నీటి శుద్ధి, నాణ్యత పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థలు ఉండనున్నాయి.
రైల్వే స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లోని పాత నీటి నిల్వ ట్యాంకులను పరిశీలించి అవసరమైన చోట కొత్త వాటిని ఏర్పాటు చేయనున్నారు. నీటి నాణ్యతను నీటి మూలం వద్ద, ప్రయాణికులకు అందించే అవుట్‌లెట్ వద్ద క్రమం తప్పకుండా పరీక్షించడంతో పాటు, పరీక్షల వివరాలను కేంద్రీకృత విధానంలో పర్యవేక్షించనున్నారు. నీటి ట్యాంకులను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం శుభ్రపరచడం, నిర్వహణ చేపట్టడం తప్పనిసరి చేయనున్నారు. ఈ కార్యక్రమం పురోగతిని రైల్వే బోర్డు స్థాయిలో నేరుగా పర్యవేక్షించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!