

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా వంటగ్యాస్ సరఫరాకు అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్ కంపెనీలకు గరిష్ఠ ఎల్‌పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. సముద్ర మార్గాల్లో ఎల్‌పీజీ దిగుమతులకు ఆటంకాలు ఏర్పడినా దేశీయ మార్కెట్‌లో కొరత తలెత్తకుండా ముందస్తు సరఫరా బఫర్‌ను ఏర్పాటు చేయడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా కేంద్రం పేర్కొంది.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. దేశంలోని 21 రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్ సంస్థల గరిష్ఠ ఎల్‌పీజీ ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 63,810 టన్నులుగా నిర్దేశించారు. ఇది 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్ సాధించిన సగటు రోజువారీ ఉత్పత్తితో పోలిస్తే దాదాపు రెట్టింపు సామర్థ్యమని, దేశ మొత్తం రోజువారీ ఎల్‌పీజీ వినియోగంలో సుమారు 70 శాతానికి సమానమని అధికారులు తెలిపారు. ఈ చర్యతో అంతర్జాతీయ సరఫరా అంతరాయాల సమయంలో దేశీయ అవసరాలను తీర్చేందుకు రక్షణ వలయం ఏర్పడనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!