

1999 కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ విజయ్’కు మద్దతుగా భారత వాయుసేన నిర్వహించిన కీలక వైమానిక దాడులే ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. కార్గిల్, ద్రాస్, బటాలిక్ ప్రాంతాల్లో అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాలను పాక్ బలగాలు ఆక్రమించడంతో వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బఠిండాకు చెందిన 17వ స్క్వాడ్రన్ ‘ది గోల్డెన్ యారోస్’ రంగంలోకి దిగింది. దాదాపు 14 వేల నుంచి 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ మంచు పర్వతాల్లోని శత్రు స్థావరాలను గుర్తించి దాడులు చేయడం అత్యంత సవాలుగా మారింది. అయినప్పటికీ గోల్డెన్ యారోస్ పాక్ స్థావరాలు, ఆయుధ నిల్వలు, సరఫరా కేంద్రాలపై కీలక దాడులు నిర్వహించింది. మిరేజ్-2000 యుద్ధ విమానాలు కూడా ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించాయి.
టైగర్ హిల్స్‌పై లేజర్ గైడెడ్ బాంబుల వినియోగం ఆపరేషన్ సఫేద్ సాగర్‌లో కీలక మలుపుగా నిలిచింది. 1999 జూన్ 24న వింగ్ కమాండర్ రఘునాథ్ నంబియార్ మిరేజ్-2000 నుంచి లేజర్ గైడెడ్ బాంబును ప్రయోగించి పాక్ స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఈ సాంకేతికతను యుద్ధ సమయంలో సమర్థంగా వినియోగించేందుకు ఇజ్రాయెల్ సాంకేతిక నిపుణులు భారత్‌కు వచ్చి సుమారు 12 రోజులపాటు బెంగళూరు, గ్వాలియర్‌లో భారత వాయుసేనతో కలిసి పనిచేశారు. లేజర్ డిజిగ్నేటర్ పాడ్‌లను విమానాలు, ఆయుధాలతో అనుసంధానించడంలో వారు సహకరించారు. యుద్ధ సమయంలో వాయుసేన వందలాది స్ట్రైక్, నిఘా, ఎస్కార్ట్ మిషన్లు నిర్వహించి పాక్ సరఫరా మార్గాలను దెబ్బతీసింది. గోల్డెన్ యారోస్‌లో బీఎస్ ధనోవా, స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా, ఫ్లయింగ్ ఆఫీసర్ రాజ్‌పాల్ సింగ్ ధలీవాల్ తదితరులు కీలక పాత్ర పోషించారు. వారి సాహసం కార్గిల్ యుద్ధ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!