

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిమజ్జనానికి సంబంధించి అభ్యంతరకర పోస్టులు, వీడియోలను సోషల్ మీడియా వేదికలపై ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియోలను ఆధారంగా చేసుకుని చర్యలు చేపట్టిన పోలీసులు.. ప్రమాదకర విన్యాసాలకు పాల్పడిన నలుగురిపై కూడా కేసులు నమోదు చేశారు. నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.
మరోవైపు గణేశ్ ఉత్సవాల్లో మహిళల భద్రతపై షీ టీమ్స్ ప్రత్యేకంగా నిఘా పెట్టాయి. ఖైరతాబాద్, బాలాపూర్ ప్రాంతాల్లో షీ టీమ్స్‌ను మోహరించి ఈవ్ టీజింగ్, వేధింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 1,530 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిలో 724 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రజలు నిబంధనలు పాటించాలని, అసభ్యకర లేదా అభ్యంతరకర కంటెంట్‌ను ప్రచారం చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!