

పదో తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు సాగేందుకు తొలి అడుగు మాత్రమేనని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. విద్యార్థులు పెద్ద కలలు కని, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆర్థిక పరిస్థితులు, వనరుల కొరత ప్రతిభకు అడ్డంకులు కావని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శ్రీరామ్ గ్రూప్ నిర్వహించిన ‘మిషన్ 10వ తరగతి – రివార్డ్ అండ్ రికగ్నిషన్’ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 632 మంది పదో తరగతి ప్రతిభావంతులకు సుమారు రూ.2.27 కోట్ల ప్రోత్సాహకాలు అందిస్తున్న శ్రీరామ్ గ్రూప్‌ను అభినందించారు.
విద్యార్థులు తమ నేపథ్యం, పరిస్థితులను కలలకు పరిమితిగా భావించకూడదని గవర్నర్ సూచించారు. విద్యతో పాటు జిజ్ఞాస, క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని, సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ప్రశ్నలు అడుగుతూ నిరంతరం నేర్చుకోవాలని అన్నారు. తమ విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత పాఠశాలలకు, సమాజానికి తిరిగి సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో, ఎండీ క్యాస్పర్స్ జె.హెచ్. క్రామ్‌హౌట్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వి.ఎన్. రెడ్డి, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఎంఓ డా. వరుణ్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!