

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి. శ్యామ్ కోశి నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన నేపథ్యంలో ఆయన బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత జస్టిస్ శ్యామ్ కోశి యాక్టింగ్ సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సెప్టెంబర్ 28న జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది.
జస్టిస్ పి. శ్యామ్ కోశి 1967 ఏప్రిల్ 30న జన్మించారు. 1991లో న్యాయవాదిగా నమోదు చేసుకుని మధ్యప్రదేశ్, అనంతరం ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో సివిల్, రాజ్యాంగ, సర్వీస్, కార్మిక చట్టాలకు సంబంధించిన కేసుల్లో ప్రాక్టీస్ చేశారు. 2013 సెప్టెంబర్‌లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2016లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 జూలై 27న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. మరోవైపు జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ 2025 జూలై 19న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!