

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. బహ్రెయిన్‌లోని అల్-రిఫా, అవాలి ప్రాంతాల్లో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. అమెరికా దురాక్రమణ, తమ గగనతలాన్ని పదేపదే ఉల్లంఘించడమే ఈ దాడులకు కారణమని ఇరాన్ పేర్కొంది. ఈ ఘటనలో పౌర పారిశ్రామిక కేంద్రం దెబ్బతిన్నట్లు బహ్రెయిన్ వెల్లడించింది. తమ గగనతలంలోకి వచ్చిన పలు డ్రోన్లను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని, చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
మరోవైపు, యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కోరారు. పశ్చిమాసియాలో అమెరికా కొనసాగిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు పరిష్కారం లభించే వరకు హర్మూజ్ జలసంధిని తెరవబోమని స్పష్టం చేశారు. శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ ప్రతినిధుల బృందం శనివారం టెహ్రాన్‌లో పర్యటించి చర్చలు జరిపింది. ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడులు జరిగినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించింది. అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తున్న మరో నౌక సముద్రంలో అమర్చిన మందుపాతరను ఢీకొనడంతో మంటలు చెలరేగినట్లు తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!