

పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో 5.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించింది. మరో 4.20 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే మార్చి నాటికి పూర్తి చేసేలా పనులు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ 2.0 కింద ఇటీవల కేంద్రం ఏపీకి మరో 3 లక్షల ఇళ్లను కేటాయించింది.
ఈ పర్యటనలో భాగంగా గృహ నిర్మాణంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ వినియోగించే పైలట్ ప్రాజెక్టుకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, CSIR-CBRI రూర్కీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో రూ.14 కోట్ల అంచనా వ్యయంతో 177 ఇళ్లను నిర్మించనున్నారు. వేగవంతమైన నిర్మాణం, శ్రమ వినియోగం మరియు నిర్మాణ వ్యర్థాలను తగ్గించడంతో పాటు నాణ్యత, దృఢత్వాన్ని మెరుగుపరచడం ఈ సాంకేతికత లక్ష్యంగా ఉంది. అనంతరం లబ్ధిదారులతో సీఎం సమావేశమై బహిరంగ సభలో పాల్గొననున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!