

తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనలను సమూలంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా చిన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేయడంతోపాటు బిల్డర్లకు, సొంతంగా ఇళ్లు నిర్మించుకునే వారికి వెసులుబాటు కల్పించేలా కొత్త సంస్కరణలను రూపొందిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న భవన నిర్మాణ నిబంధనలు 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినవే. అప్పటి నుంచి అవసరాలకు అనుగుణంగా మొత్తం 62 సార్లు మార్పులు చేశారు. 2016లో అప్పటి BRS ప్రభుత్వం కూడా నిర్మాణ అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించడం, అనుమతుల గడువును పొడిగించడం వంటి కీలక సవరణలు తీసుకొచ్చింది. అయితే ఈ మార్పులన్నింటినీ సమీక్షించి సమగ్ర నియమావళిని రూపొందించాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ప్రధానంగా సెట్‌బ్యాక్ నిబంధనలను 20 శాతం వరకు తగ్గించే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం రోడ్డు వెడల్పును బట్టి భవనాల చుట్టూ ఖాళీ స్థలం వదలాల్సి ఉంటుంది. ఉదాహరణకు 100 నుంచి 200 చదరపు మీటర్ల స్థలంలో 10 మీటర్ల ఎత్తుతో నిర్మించే భవనానికి 36 అడుగుల రోడ్డు ఉంటే 1.5 మీటర్లు, 54 నుంచి 72 అడుగుల రోడ్డు ఉంటే మూడు మీటర్ల సెట్‌బ్యాక్ వదలాలి. ఈ నిబంధనల్లో మార్పులు చేస్తే నిర్మాణానికి అందుబాటులో ఉండే స్థలం పెరిగి యజమానులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
నిర్మాణ అనుమతులు: ప్రస్తుతం 75 గజాల వరకు ఉన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు అవసరం లేదు. ఈ పరిమితిని 100 గజాలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.
సెల్లార్ నిర్మాణం: ప్రస్తుతం కనీసం 900 గజాల స్థలంలో నిర్మించే భవనాలకే సెల్లార్ అనుమతి ఇస్తున్నారు. ఈ పరిమితిని 600 గజాలకు తగ్గించాలని ప్రతిపాదిస్తున్నారు.
రెండు సెల్లార్లకు అవకాశం: 750 నుంచి 1,000 చదరపు మీటర్ల స్థలాల్లో నిర్మించే భవనాలకు ప్రస్తుతం ఒక సెల్లార్‌కే అనుమతి ఉంది. పార్కింగ్ సమస్యలను పరిష్కరించేందుకు రెండు సెల్లార్ల నిర్మాణానికి అనుమతించాలని భావిస్తున్నారు.
మార్టిగేజ్ నిబంధనలు: నిర్మాణం పూర్తయినప్పటికీ మార్టిగేజ్ నిబంధనల కారణంగా భవనాలను పూర్తిస్థాయిలో విక్రయించలేకపోతున్నామని బిల్డర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్దిష్ట వైశాల్యంలో నిర్మించే చిన్న భవనాలకు మార్టిగేజ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.
ఈ ప్రతిపాదనలపై ప్రస్తుతం అధికారులు ముసాయిదా రూపొందిస్తున్నారు. ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిన తర్వాతే కొత్త భవన నిర్మాణ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!