

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో రూపొందించిన స్మార్ట్ గ్లాసెస్ వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత గోప్యతకు ముప్పు, భద్రతా లోపాలు, AI ద్వారా తప్పుడు సమాచారం అందించే ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంటూ నెదర్లాండ్స్‌కు చెందిన స్వతంత్ర డేటా ప్రొటెక్షన్ సంస్థ ఆటోరిటైట్ పర్సూన్స్‌గెగెవెన్స్ (AP) వినియోగదారులకు కీలక సూచన చేసింది. సాధారణ కళ్లద్దాల మాదిరిగా కనిపించే ఈ పరికరాల్లో కెమెరాలు, మైక్రోఫోన్లు అమర్చడంతో చుట్టుపక్కల వ్యక్తులకు తెలియకుండానే ఫొటోలు, వీడియోలు, సంభాషణలను రికార్డు చేసే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఆరు స్మార్ట్ గ్లాసెస్ మోడళ్లను పరీక్షించిన సంస్థ పలు ఆందోళనకరమైన అంశాలను గుర్తించింది. అత్యవసర వైద్య పరిస్థితిని అనుకరించినప్పుడు అంబులెన్స్‌కు ఫోన్ చేసినట్లు ఒక గ్లాస్ తప్పుడు సమాచారం ఇచ్చింది. మరో పరికరం మైనర్‌పై ప్రేమ ఆసక్తి వ్యక్తం చేసిన ఓ పెద్ద వ్యక్తికి అనుచితమైన డేటింగ్ సలహా ఇచ్చింది. అంతేకాకుండా మందుల వినియోగ సూచనలు, భద్రతాపరమైన హెచ్చరికలను కూడా తప్పుగా అందించినట్లు వెల్లడించింది. కొన్ని పరికరాల్లో అనధికార వ్యక్తులు రికార్డింగ్‌లను యాక్సెస్ చేసే లేదా కెమెరాలను రిమోట్‌గా నియంత్రించే అవకాశమున్న భద్రతా లోపాలను గుర్తించింది.
ఈ స్మార్ట్ గ్లాసెస్‌లోని AI ఫీచర్లు ఫొటోలు, ఆడియోలను బాహ్య సర్వర్లకు పంపి విశ్లేషించే అవకాశం ఉండటంతో వ్యక్తిగత సమాచారం ఎక్కడికి వెళ్తోంది? ఎవరెవరు దాన్ని యాక్సెస్ చేస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని AP పేర్కొంది. రికార్డింగ్ జరుగుతున్నట్లు సూచించే చిన్న లైట్ ఉన్నప్పటికీ, అది చుట్టుపక్కల వారికి తగిన సమాచారం అందించడానికి సరిపోదని అభిప్రాయపడింది. భారత్‌లో ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో చిత్రీకరణపై దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న సంపూర్ణ నిషేధం లేదు. అయితే ప్రైవేట్ ప్రాంతాల్లో అనుమతి లేకుండా చిత్రీకరించడం, వ్యక్తిగత దృశ్యాలను రహస్యంగా రికార్డు చేయడం, వాటిని వేధింపులు లేదా ఇతరులపై నిఘా కోసం ఉపయోగించడం చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా వాష్‌రూమ్‌లు, దుస్తులు మార్చుకునే గదులు, ఆసుపత్రులు వంటి ప్రదేశాల్లో కెమెరా ఉన్న కళ్లద్దాలను ఉపయోగించకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. రికార్డు చేసిన దృశ్యాలను ఆన్‌లైన్‌లో షేర్ చేసే ముందు ఇతరుల అనుమతి, గోప్యతను పరిగణనలోకి తీసుకోవాలి. స్మార్ట్ గ్లాసెస్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మారుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!