

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలు, టీనేజర్ల భద్రత కంటే యూజర్ ఎంగేజ్‌మెంట్, వృద్ధి, లాభాలకే మెటా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని సంస్థ మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ ఆర్టురో బెజార్ ఆరోపించారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో జరుగుతున్న కీలక విచారణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పలు అమెరికా రాష్ట్రాలు కలిసి దాఖలు చేసిన ఈ కేసులో.. యువతను ఎక్కువసేపు ప్లాట్‌ఫారమ్‌లపై ఉండేలా చేసే విధంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను రూపొందించారని, దీనివల్ల ఆందోళన, డిప్రెషన్, వేధింపులు వంటి సమస్యలు పెరిగాయని ఆరోపణలు ఉన్నాయి. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని చట్టవిరుద్ధంగా సేకరించి ఉపయోగించిందనే ఆరోపణలు కూడా మెటాపై ఉన్నాయి.
2009 నుంచి 2015 వరకు మెటాలో పనిచేసిన బెజార్.. 2019 నుంచి 2021 మధ్య స్వతంత్ర కాంట్రాక్టర్‌గా కూడా సంస్థతో కలిసి పనిచేశారు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు కీలక ఉత్పత్తి నిర్ణయాలపై గణనీయమైన ప్రభావం ఉందని ఆయన పేర్కొన్నారు. తన టీనేజ్ కుమార్తె ఇన్‌స్టాగ్రామ్‌లో ఎదుర్కొన్న లింగవివక్షపూరిత వ్యాఖ్యలను కూడా బెజార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 13 ఏళ్లలోపు వినియోగదారులను గుర్తించే సాంకేతిక సామర్థ్యం మెటాకు ఉన్నప్పటికీ, లాభాలపై ప్రభావం పడుతుందనే కారణంతో దానిని పూర్తిస్థాయిలో వినియోగించలేదని ఆయన ఆరోపించారు. మరోవైపు, భద్రత కోసం వందలాది మంది సిబ్బందిని నియమించామని, వినియోగదారులకు విరామం తీసుకోవాలని సూచించే ఫీచర్లు ఉన్నాయని మెటా వాదిస్తోంది. సుమారు ఆరు వారాల పాటు కొనసాగే ఈ విచారణలో తుది నిర్ణయం మెటాపై బాధ్యత, జరిమానాలు, ప్లాట్‌ఫారమ్‌లలో మార్పులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!