

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత యువ బాక్సర్ జాదుమణి సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. పురుషుల 55 కేజీల విభాగం రౌండ్ ఆఫ్ 16లో పాకిస్థాన్ బాక్సర్ సుమామ రెహమాన్‌పై 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. 22 ఏళ్ల మణిపూర్ బాక్సర్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించి భారత పతక ఆశలను మరింత బలపరిచాడు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఈ పోరు జరగడంతో జాదుమణి సాధించిన విజయానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది.
పోరు అనంతరం స్పందించిన జాదుమణి తన విజయాన్ని భారత కార్గిల్ వీరులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. పాకిస్థాన్ బాక్సర్‌పై విజయం సాధించడం గర్వంగా ఉందని, క్వార్టర్ ఫైనల్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసి భారత్‌కు స్వర్ణ పతకం అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తారు. తొలి రౌండ్‌లో బై పొందిన సుమామ రెహమాన్ ప్రీక్వార్టర్స్‌కు చేరుకోగా, అక్కడ జాదుమణి ధాటికి నిలవలేకపోయాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!