

దాదాపు 90 ఏళ్లుగా ప్రపంచంలోని ప్రముఖ గణిత శాస్త్రవేత్తలకు సవాల్‌గా నిలిచిన నేవియర్-స్టోక్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ స్మూత్‌నెస్ సమస్యకు తమ అంతర్గత కృత్రిమ మేధస్సు వ్యవస్థ పరిష్కారం చూపిందని OpenAI ప్రకటించింది. క్లే మ్యాథమెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ గుర్తించిన ఏడు మిలీనియం ప్రైజ్ సమస్యల్లో ఇది ఒకటి. ద్రవాల కదలికను వివరించే నేవియర్-స్టోక్స్ సమీకరణాలు మూడు డైమెన్షన్లలో సాఫీగా ప్రారంభమైన ద్రవ ప్రవాహం పరిమిత సమయంలో సింగ్యులారిటీకి దారితీస్తుందా అనే ప్రశ్నకు సమాధానం కోసం ప్రయత్నిస్తాయి. వాతావరణ అంచనాలు, విమానాల రూపకల్పన, రక్తప్రవాహ అధ్యయనాలు వంటి అనేక రంగాల్లో ఈ సమీకరణాలు కీలకంగా ఉపయోగపడుతున్నాయి. తమ AI వ్యవస్థ ఒక సుడిగుండం లోపలికి కుంచించుకుంటూ, మరింతగా సాగదీయబడే పరిస్థితిలో పరిమిత సమయంలో సింగ్యులారిటీ ఏర్పడగలదని నిరూపించిందని OpenAI తెలిపింది.
ఈ పరిశోధన కోసం సుమారు 10 వేల AI ఏజెంట్లు ఏకకాలంలో పనిచేశారని OpenAI వెల్లడించింది. నేవియర్-స్టోక్స్ సమస్యపై ఏజెంట్లు సుమారు 2.7 మిలియన్ సందేశాలను పరస్పరం పంచుకుని, దాదాపు 130 బిలియన్ అవుట్‌పుట్ టోకెన్లను ఉపయోగించారు. సుమారు 88 గంటల్లో పరిష్కారాన్ని కనుగొనగా.. Lean అనే ఫార్మల్ వెరిఫికేషన్ వ్యవస్థ ద్వారా దాన్ని తనిఖీ చేయడానికి మరో 17 గంటలు పట్టింది. అయితే ఇది అధికారికంగా సమస్య పరిష్కారమైనట్లు ఇంకా భావించలేం. గణిత నిపుణులు ఈ ప్రూఫ్‌ను స్వతంత్రంగా పరిశీలించి ధృవీకరించాల్సి ఉంది. ఇదే సమయంలో ట్రిస్టన్ బక్‌మాస్టర్, లెవెంట్ ఆల్పోగేలు ఇదే తరహా పరిశోధనపై తాము పనిచేస్తున్నామని ప్రశ్నలు లేవనెత్తారు. తమ అప్రచురిత పరిశోధనను ఉపయోగించలేదని OpenAI స్పష్టం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!