

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన భారత్, ఇప్పుడు గువాహటిలో జరిగే రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని దృఢ సంకల్పంతో ఉంది. శనివారం ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ గువాహటి వేదికగా జరగనున్న మొదటి టెస్టు కావడం విశేషం. శుభ్‌మన్ గిల్ గాయంతో దూరమైన నేపథ్యంలో రిషబ్ పంత్ నాయకత్వంలో జట్టును ముందుకు నడిపించడం పెద్ద సవాలుగా మారింది.
ఈడెన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో నాలుగు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత్ భారీ మూల్యమే చెల్లించుకుంది. స్పిన్‌కు అనుకూలమైన పిచ్ తయారీ చివరకు జట్టుకే వ్యతిరేకంగా మారింది. రెండో రోజు నుంచే బంతి ఎక్కువగా తిరిగిపోవడం వల్ల భారత బ్యాటర్లు నిలబడలేకపోయారు. 124 పరుగుల చిన్న లక్ష్యాన్ని కూడా చేధించలేక 93 పరుగుల వద్ద కుప్పకూలడం జట్టుకు తీవ్ర అవమానాన్ని తెచ్చిపెట్టింది. కోచ్ గౌతమ్ గంభీర్, జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో రెండో టెస్టులో ఇండియా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గువాహటి పిచ్ సమతూకంతో ఉండొచ్చని అంచనా. బ్యాటింగ్, బౌలింగ్‌కు అవకాశాలున్న పిచ్ కావడంతో జట్టులో కీలక మార్పులు తప్పనిసరి అయ్యాయి. అక్షర్ పటేల్ స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి రానున్నాడు. సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా, గిల్ స్థానంలో ధ్రువ్ జురెల్ నాలుగో స్థానంలో దిగుతాడు.
జడేజా, సుందర్, కుల్దీప్ త్రయంలో స్పిన్ బాధ్యతలు ఉండనున్నాయి. బుమ్రా, సిరాజ్ కొత్త బంతిని పంచుకుంటారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ పై పెద్ద బాధ్యత ఉంది; తొలి టెస్టులో విఫలమైన వీరిద్దరూ ఈసారి బలమైన ఇన్నింగ్స్ ఆడాలని జట్టు కోరుకుంటోంది.
దక్షిణాఫ్రికా పక్షాన కీలక పేసర్ రబాడ మరోసారి దూరమవ్వడం భారత్‌కు పాజిటివ్ సైన్. అయితే మార్కో యాన్సెన్ మరియు కార్బిన్ బోష్ పేస్ దాడి ప్రమాదకరంగానే నిలిచే అవకాశం ఉంది. తొలి టెస్టులో భారత్‌ను చికాకు పెట్టిన స్పిన్నర్ సైమన్ హార్మర్‌ను గువాహటిలో ఎదుర్కోవడమే మరో పరీక్ష. కేశవ్ మహరాజ్ కూడా స్పిన్‌లో బలం. ముల్డర్ స్థానంలో సెనురాన్ ముత్తుస్వామి రావొచ్చని సమాచారం.
సఫారీ బ్యాటింగ్ లైనప్‌లో మార్క్రమ్, రికిల్టన్, టోనీ డి జోర్జి, స్టబ్స్ వంటి బ్యాటర్లు ఫామ్‌లో ఉన్నారు. 15 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు గెలిచిన ఉత్సాహంతో, 25 ఏళ్ల తర్వాత సిరీస్ గెలవాలని దక్షిణాఫ్రికా లక్ష్యంగా పెట్టుకుంది.
గువాహటి పిచ్ తొలి రెండు రోజుల్లో పేసర్లకు కొంత అనుకూలం. బ్యాటింగ్ తర్వాత సులభమవుతుంది. మూడో రోజు నుంచి స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఆట ప్రారంభం ఉదయం 9 గంటలకు, టీ బ్రేక్ 11కు, లంచ్ 1.20 కు మార్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!