

రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు సామరస్యపూర్వక వాతావరణంలో జరిగేలా చూడాలని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో కూటమి పక్షాలు సాధించిన ఘన విజయ స్ఫూర్తిని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ శ్రేణుల సన్నద్ధతపై ఆదివారం మధ్యాహ్నం ముఖ్య నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26న జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలకు జనసేన నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ముఖ్య నేతలు ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మూడు విడతల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగాలని స్పష్టం చేశారు. కూటమి పక్షాల మధ్య ఐక్యతకు ఈ ఎన్నికలు నిదర్శనంగా నిలవాలని ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!