

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి, టీపీసీసీ నేత ఏ. రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి బీఎం సందీప్ కుమార్‌కు స్వాగతం పలికారు. గతంలో మీనాక్షి నటరాజన్ ఇన్‌ఛార్జిగా ఉన్న సమయంలో పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 85 శాతం విజయాలు సాధించామని గుర్తుచేశారు. తెలంగాణలో తొలిసారిగా ఓబీసీ కులగణన చేపట్టామని పేర్కొంటూ, 2027లో కేంద్రం నిర్వహించనున్న జనగణనలో ఓబీసీ కులగణనను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రానికి తీర్మానం ద్వారా విజ్ఞప్తి చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓటర్ల జాబితాల నుంచి పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మహిళల ఓటు హక్కుకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారని పేర్కొంటూ, కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్లు ఇప్పటి నుంచే ఓటర్ల జాబితాలను పరిశీలించాలని ఆదేశించారు. మరోవైపు, రాబోయే ఐదు నెలల పాటు ప్రజాబలం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలను కలవాలని, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యమని, అవసరమైన నిధులు అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!