

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేపట్టిన దాడి వివరాలను బీ-2 స్పిరిట్ బాంబర్ విమానాల పైలట్లు సురక్షితంగా తిరిగి చేరకముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినట్లు వెల్లడైంది. 2025 జూన్ 22న జరిగిన ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పైలట్లు అమెరికా మిలిటరీ పత్రిక ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. అమెరికా తూర్పు ప్రాంతం నుంచి దాదాపు 18 గంటల పాటు ప్రయాణించిన బీ-2 విమానాలు ఇరాన్ సమీపానికి చేరుకున్నాయి. టెహ్రాన్ సమీపంలోని నగర కాంతులను గమనించిన పైలట్లు లక్ష్యానికి చేరువైనట్లు గుర్తించారు. అనంతరం 30 వేల పౌండ్ల బరువున్న రెండు బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించగా.. భారీ అగ్నిగోళం ఎగసిపడిందని వారు వివరించారు.
ఫోర్డో అణు కేంద్రంలోని వెంటిలేషన్ షాఫ్ట్‌లపై ఇరాన్ కాంక్రీట్ పొరను ఏర్పాటు చేసినట్లు గుర్తించడంతో దాడి ప్రణాళికలో చివరి నిమిషంలో మార్పులు చేశారు. ఆపరేషన్‌కు కేవలం 16 గంటల ముందు తుది ప్రణాళిక సిద్ధమైంది. వైట్‌మన్ ఎయిర్ బేస్ నుంచి ఏడు బీ-2 బాంబర్లు బయల్దేరగా.. ఆరు ఫోర్డోను, మరొకటి నతాంజ్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. మరోవైపు అసలు ప్రయాణ మార్గంపై గందరగోళం సృష్టించేందుకు కొన్ని విమానాలను డియాగో గార్సియా వైపు పంపినట్లు సమాచారం. అర్ధరాత్రి 2.10 గంటలకు తొలి బాంబు కాంక్రీట్ పొరను ఛేదించగా.. ఆ తర్వాతి దాడులు అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. మొత్తం 14 బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించారు. వాటి బరువు సుమారు 190 మెట్రిక్ టన్నులు. తిరుగు ప్రయాణంలో విమానాలకు గగనతలంలో ఇంధనం నింపుతున్న సమయంలోనే ట్రంప్ ఆపరేషన్ గురించి ప్రకటించినట్లు పైలట్లు తెలిపారు. దాడి అనంతర అంచనాల్లో ఇరాన్ అణు పదార్థాలను శుద్ధి చేసే సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారని కథనం పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!