

టీడీపీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఇద్దరు తమ్ముళ్ల కుమారులు రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవల మంత్రి నారా లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరిగినప్పటికీ వారు ఇచ్చిన వివరణ తనకు సమంజసంగా అనిపించలేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ నుంచి తగిన గౌరవం, సహకారం లభించడం లేదని ఆరోపించారు. ధర్మవరం, అనంతపురం, కోస్తా ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. తమకు ముందుగా ఒకటి చెప్పి, ఆ తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన వద్ద ఉన్న వివరాలతో పాటు రాష్ట్ర బీజేపీ నాయకత్వం సేకరించిన అంశాలను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికతో ఢిల్లీకి రావాలని పార్టీ పెద్దలు కోరినట్లు వెల్లడించారు.
తనకు మంత్రి పదవి కావాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడమే తన అభ్యంతరమని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. తమకు పదవి దక్కకపోవడం వెనుక ఏవైనా ఒప్పందాలు జరిగాయా అనే అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కడప జెడ్పీ పదవిని ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినందునే తాము పోటీలో నిలిచామని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో చర్చించిన తర్వాత తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తానని, అక్కడి చర్చలు సంతృప్తికరంగా లేకపోతే రాజీనామా లేఖను అందించి తిరిగి వస్తానని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందులు తప్పవని, సీట్ల కేటాయింపులోనూ అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన మధ్య కూడా కొన్ని విభేదాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!