

రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తుంటే వైకాపా ఓర్చుకోలేక తప్పుడు ప్రచారానికి దిగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే, జగన్‌కు చెందిన సాక్షి పత్రిక బాధ్యతారహిత కథనాలు ప్రచురిస్తోందని మండిపడ్డారు. శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వానించినందుకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పడం సంప్రదాయమని, దానిపై సాక్షి పత్రికలో విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. కియా అనుబంధ పరిశ్రమలతో పాటు హ్యుందాయ్ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, గతంలో కియా పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
పులివెందులలో వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులతో కలిసి రౌడీయిజానికి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో పెత్తనం చేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పాఠశాలలో బాలికపై రంపంతో దాడి జరిగిన ఘటనలో బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, సీఎం సహాయనిధి నుంచి రూ.32 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ పోలీసులపై కేసులు వేయడం సరికాదన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూటమి ఓటమికి గల కారణాలను అధ్యయనం చేయాలని, అరకు ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బలవంతపు మతమార్పిడులు తప్పని పేర్కొంటూ, కూటమి పార్టీల మధ్య సమన్వయం పెంచుకోవాలని సూచించారు. పదవుల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న నాయకులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!