

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైన 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాలను ఆయన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ప్రారంభించారు. 'కనెక్టింగ్ రోడ్స్, క్రియేటింగ్ టుమారో' అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సులో పర్యావరణహిత రహదారుల నిర్మాణం, కృత్రిమ మేధ, డిజిటల్ సాంకేతికత వినియోగంపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు తదితరులు హాజరయ్యారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణను మూడు ప్రాంతాలుగా విభజించి ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని కలుపుకునే క్యూర్ (CURE) పరిధిలో సేవా రంగానికి, ఓఆర్‌ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్యూర్ (PURE) పరిధిలో తయారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆర్ఆర్ఆర్ వెలుపలి ప్రాంతమైన రేర్ (RARE) పరిధిలో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించనున్నారు. నూతన ఉస్మానియా ఆసుపత్రి, టిమ్స్ ఆసుపత్రులతో పాటు ఇతర వైద్యశాలల్లో కలిపి 8 వేల పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు, రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారత్ ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. నవంబర్ 22 వరకు జరిగే ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా సుమారు 3,500 మంది నిపుణులు, ఇంజినీర్లు, అధికారులు హాజరుకానున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!