

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలనకు బదులుగా అవినీతి పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన జడ్చర్ల అనిరుధ్ రెడ్డి, మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల వ్యాఖ్యలే ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని అన్నారు. పనుల కోసం 20 శాతం కమీషన్లు అడుగుతున్నారని, టెండర్లు, కాంట్రాక్టుల్లో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా పెన్షన్ల విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న 44.70 లక్షల పెన్షన్లలో 4.70 లక్షలు తొలగించారని, కొత్తగా 4.63 లక్షల పెన్షన్లు మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లోనే పెన్షన్‌ను రూ.4,000కు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ రూ.2,000 మాత్రమే అందిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అవినీతి సొమ్మును ప్రజలకు తిరిగి చెల్లించాల్సి వస్తుందని, మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ నాయకుల వద్ద తాకట్టు పెడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒత్తిడికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర ప్రయోజనాల కోసం మళ్లుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో భూపాలపల్లి నియోజకవర్గంలో మున్సిపాలిటీ, జిల్లా కేంద్రం, మెడికల్ కాలేజీ ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!