

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసులను త్వరగా తేల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), మాజీ ఎంపీ హరిరామజోగయ్య ఈ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులు దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్నాయని, పలు కేసుల్లో 150కి పైగా డిశ్ఛార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆ పిటిషన్లపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోందని వివరించారు.
కేసుల విచారణను రోజువారీగా చేపట్టేలా ఆదేశించాలని హరిరామజోగయ్య తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. 2024లోనే సుప్రీంకోర్టు రోజువారీ విచారణకు ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఆశించిన పురోగతి లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, హరిరామజోగయ్య వ్యక్తిగత ఆసక్తితోనే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని జగన్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!