

2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై చర్చలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ 403 అసెంబ్లీ స్థానాల్లో 181 సీట్లు కోరుతున్నట్లు వార్తలు వస్తుండగా, అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ మాత్రం ప్రారంభ ప్రతిపాదనగా 24 స్థానాలను మాత్రమే ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 20 వేలకుపైగా ఓట్లు సాధించిన 21 నియోజకవర్గాలతో పాటు, ఆ మార్కుకు చేరువైన మరో మూడు స్థానాలను పరిగణనలోకి తీసుకుని ఎస్పీ ఈ ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సంఖ్యలపై ఇరు పార్టీల మధ్య ఇంకా తుది అంగీకారం కుదరలేదు.
సీట్ల పంపకాలపై చర్చించేందుకు ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుంది. నవంబర్ 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో సమావేశాలు నిర్వహించే అవకాశముందని ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ వెల్లడించారు. మరోవైపు, కాంగ్రెస్ కూడా ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ సహా ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఎస్పీతో చర్చలు జరపనుంది. 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించగా, ఎస్పీ 111 స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు కేటాయిస్తే తమ పార్టీ విజయావకాశాలపై ప్రభావం పడుతుందని ఎస్పీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!