

అక్వాన్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం ఏలూరు జిల్లా అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. నవంబర్ 20న నెల్లూరు, తుని మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తుఫాన్ దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, గర్భిణీలకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు అందించాలని, తాగునీరు, విద్యుత్, రవాణా, వైద్యం, పారిశుధ్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!