

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరవు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తొలిసారిగా అన్యాయం జరిగిందని విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఏర్పాటు చేసి రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)ను కాపాడారని గుర్తుచేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అయితే నీటి కేటాయింపుల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు ప్రాంతంలో సుమారు 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించామని కేటీఆర్ తెలిపారు. దీంతో ఇతర జిల్లాల నుంచి ప్రజలు పాలమూరుకు వలస వచ్చారని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చిందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు ఎక్కువ నష్టం చేస్తున్నారని విమర్శించారు. నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించుకుపోతుంటే నల్గొండ జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో లేని క్రాప్ హాలిడే తెలంగాణలోనే ఎందుకు వస్తోందని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం నీటిని తీసుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!