

రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. భేటీ అనంతరం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ వేదికగా ప్రశ్నలు సంధిస్తామని తెలిపారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలకు సంబంధించిన సమస్యలను సభలో లేవనెత్తుతామని చెప్పారు. ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ కోసం అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో బీఆర్‌ఎస్ తరఫున డిమాండ్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ అంశాలపై నిరసనగా రాబోయే రోజుల్లో కేసీఆర్ స్వయంగా లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని తెలిపారు. వ్యవసాయ భూములను 22A కింద నిషేధిత జాబితాలో చేర్చడం, కరెంట్ కోతలు, రుణమాఫీ, పాలిటెక్నిక్ జీవో 97, సింగరేణి అంశాలు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై చేస్తున్న వ్యాఖ్యలను కూడా హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!