

భారత వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు (AI) క్రమంగా కీలక పాత్ర పోషిస్తోంది. సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానానికి తోడుగా డేటా ఆధారిత సమాచారాన్ని అందిస్తూ రైతుల నిర్ణయాలను మరింత ఖచ్చితంగా మార్చే అవకాశాలను ఏఐ కల్పిస్తోంది. గూగుల్ డీప్‌మైండ్‌కు చెందిన ఆంత్రోకృషి బృందం ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వ్యవసాయ భూములను మ్యాప్ చేయడం, పంటల సాగు పరిస్థితులను పర్యవేక్షించడం కోసం ఏఐ మోడళ్లను రూపొందించింది. ఒక మోడల్ పొలాలు, చెట్లు, నీటి వనరులను గుర్తిస్తుండగా.. మరో మోడల్ 12 రకాల పంటల్లో విత్తడం, కోత దశలను పర్యవేక్షిస్తూ వ్యవసాయ సీజన్‌లో దాదాపు రియల్‌టైమ్ సమాచారాన్ని అందించేలా పనిచేస్తోంది.
వాతావరణ మార్పులు, అనిశ్చిత వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు, నీటి కొరత, పంటలకు ఎదురయ్యే ముప్పులను ఎదుర్కోవడంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడే అవకాశం ఉంది. తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాల ద్వారా ఈ డేటాను వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను భర్తీ చేయడం ఏఐ లక్ష్యం కాదని, రైతులు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని అందించడమే ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. డేటా నాణ్యత, టెక్నాలజీపై అవగాహన, వినియోగం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ.. భారత డిజిటల్ మౌలిక వసతులు వ్యవసాయంలో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేసే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!