

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క కొండ సురేఖ బర్తరఫ్‌కు సంబంధించిన పరిణామాలపై స్పందించారు. ఎవరైనా పార్టీ నిర్ణయానికి, అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి పనిచేయాలని అన్నారు. పార్టీలో ఏవైనా సమస్యలు లేదా అభిప్రాయ భేదాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. ఇలా వ్యవహరించడం వల్ల వ్యక్తిగత గౌరవంతో పాటు పార్టీ కూడా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకు భయపడే స్థాయిలో లేదని, పార్టీలో క్రమశిక్షణ అవసరమని సీతక్క అన్నారు. ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శలు చేయడాన్ని అధిష్ఠానం ఆమోదించలేదని, అందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ.. తన సోదరి కవితను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపించారో కేటీఆర్ సమాధానం చెప్పాలని, అలాగే అప్పటి డిప్యూటీ సీఎం రాజయ్యను ఎందుకు బర్తరఫ్ చేశారో కూడా వివరించాలని అన్నారు. కొండ సురేఖ పార్టీలోనే ఉన్నారని, అందరూ సంయమనంతో కలిసి పార్టీ అభివృద్ధికి పనిచేస్తామని సీతక్క స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!