

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పనిచేయని నియోజకవర్గాల సమన్వయకర్తలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. వారి పనితీరుపై ప్రత్యేక నివేదికలు తెప్పించుకుని సమీక్షిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో వారి పనితీరుతోపాటు గత రెండున్నరేళ్లుగా పార్టీ కోసం చేసిన కృషిని కూడా మదింపు చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పలువురు పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఇటీవల జైల్లో ఉండి కూడా పెళ్లకూరు జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన సత్యనారాయణ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఆయన పట్టుదల, పోరాట స్ఫూర్తితో ఇతర నాయకులు కూడా పనిచేయాలని జగన్ సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పలువురు నియోజకవర్గ ఇన్‌ఛార్జులు సరిగా బాధ్యతలు నిర్వర్తించలేదని, పార్టీ సూచనలను పట్టించుకోలేదని సత్యనారాయణ రెడ్డి జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇలాంటి నేతలపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, పార్టీని ప్రక్షాళన చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
దీనిపై స్పందించిన జగన్.. సరిగా పనిచేయని ఇన్‌ఛార్జుల జాబితాను సిద్ధం చేస్తున్నానని, త్వరలోనే అందరితో ఈ అంశంపై మాట్లాడతానని చెప్పినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గ సమన్వయకర్త తమ ప్రాంతంలో కొన్ని చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయని వివరించబోగా.. ఇప్పటికే మీ పనితీరుపై నివేదిక ఉందని, ప్రత్యేకంగా మాట్లాడతానని జగన్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఇన్‌ఛార్జుల వారీగా రూపొందించిన నివేదికల్లో పలు అంశాలను పరిశీలిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలతో కలిసి పనిచేయడం, పోటీకి దూరంగా ఉండటం, అభ్యర్థులకు ఆర్థికంగా అండగా నిలవకపోవడం, ఎన్నికల సమయంలో సహకరించకపోవడం, అభ్యర్థుల ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం, చివరకు సాధించిన ఫలితాలు వంటి అంశాల ఆధారంగా పనితీరును అంచనా వేస్తున్నారు. ఈ సమీక్ష అనంతరం నియోజకవర్గ స్థాయిలో పార్టీ నాయకత్వంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!