

ఎన్నికల్లో తనతో పోటీ చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. దమ్ముంటే సిద్దిపేటకు వచ్చి తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. నీళ్ల విషయంలో గతంలోనూ, ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఈ విషయానికి సంబంధించిన ఆధారాలను అసెంబ్లీ వేదికగా బయటపెడతానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్‌తో తన ఎత్తు గురించి, కేటీఆర్ గడ్డం గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సిద్దిపేటలో సీఎం నిర్వహించిన సభలో అబద్ధపు మాటలు, బూతులు తప్ప మరేమీ లేవని ఎద్దేవా చేశారు. ఆ సభకు 26 నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించారని ఆరోపించారు.
నిన్నటి సభలో కేసీఆర్, కేటీఆర్‌తో పాటు తన పేరును రేవంత్ రెడ్డి సుమారు 140 సార్లు ప్రస్తావించారని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పతనావస్థకు చేరుకుంటోందనడానికి ఆ సభే నిదర్శనమని వ్యాఖ్యానించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎంపై విమర్శలు చేస్తూ అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తూ జలదోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తోందని విమర్శించారు. తాము రాజీనామా చేసిన తర్వాతే పోతిరెడ్డిపాడు జీవో వచ్చిందని పేర్కొన్న హరీశ్ రావు.. తప్పుడు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్‌ను మించిన నటుడు రేవంత్ రెడ్డి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!