

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సిద్దిపేటలో సీఎం నిర్వహించిన సభలో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం గురించి మాట్లాడకుండా కేసీఆర్, కేటీఆర్, తనపై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతుల సమస్యలు, హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిద్దిపేట సభ నిర్వహించారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాలను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపిస్తూ.. నాగార్జునసాగర్ కుడివైపు నిర్మిస్తున్నట్లు చెబుతున్న టన్నెల్, బనకచర్ల ప్రాజెక్టు అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కృష్ణా జలాల వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో అన్యాయం చేసిందని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేసిందని పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు దేవాదుల, కల్వకుర్తి, సీతారామ ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ఎన్ని మోటార్లు నడిపారు, ఎంత నీటిని వినియోగించారు, ఎంత నీటిని వృథాగా వదిలేశారనే వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కుప్పానికి నీళ్లు అందుతున్నప్పుడు పాలమూరు ప్రాజెక్టులకు ఎందుకు నీళ్లు అందడం లేదని ప్రశ్నించారు. రైతులకు పంట నష్టపరిహారం, ధాన్యం కొనుగోళ్లు, సన్నవడ్ల బోనస్ వంటి అంశాల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సిద్దిపేటలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన హరీశ్ రావు, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ రాజకీయంగానే కాకుండా న్యాయపరంగానూ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!