

తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఓటర్ల నుంచి అభ్యర్థనలు, అభ్యంతరాలు స్వీకరించేందుకు సెప్టెంబర్ 16 వరకు ఉన్న గడువును మరికొన్ని వారాలు పొడిగించాలని కోరారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు నిర్దేశించిన గడువును కూడా పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 73.39 లక్షల ఓటరు నమోదు వివరాలు ఏఎస్‌ఎస్‌డీ విభాగంలో ఉన్నాయని సీఎం తెలిపారు.
తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని శాశ్వతంగా తరలివెళ్లిన వారిగా పరిగణించే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్లు తమ కొత్త చిరునామాలో నమోదు చేసుకునేందుకు అవసరమైన సహాయం అందించాలని, జారీ చేసే నోటీసులకు స్పందించేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తొలగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఓటర్ల నమోదు అధికారుల స్థాయిలో సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!