

పులివెందులలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగానే దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ వైసీపీ కార్యకర్తలు అల్లర్లకు పాల్పడ్డారని, ఆ ఘటనల్లో పోలీసులపై రాళ్లదాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని విమర్శించారు. నిందితులపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, నామినేషన్లు దాఖలు చేస్తున్న తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేసి గాయపరిచాయని బీటెక్ రవి ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వైసీపీ నాయకులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. ఎన్నికల సమయంలో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీటెక్ రవి చేపట్టిన ధర్నాకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!