

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు జనసేన పార్టీలో చేరారు. ఆయన తల్లిదండ్రులు చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి, ఉమారాణి భీమవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అనంత శ్రీరామ్ తల్లి ఉమారాణి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ గ్రామం ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలో ఉంది. తన తల్లిదండ్రుల నిర్ణయంపై అనంత శ్రీరామ్ స్పందిస్తూ, గ్రామంలో మహిళకు సర్పంచ్‌గా అవకాశం రావడంతో తన తల్లిని అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గ్రామంలోని ఇతర రాజకీయ పార్టీలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయని, ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే సంతోషంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ కీలకమని, ఆ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ నాయకత్వంపై నమ్మకంతోనే తన తల్లిదండ్రులు జనసేనలో చేరినట్లు వివరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!